అమరావతి స్తూపం

అమరావతి లో గౌతమ బుద్ధుని అవశేషాలను పూజల నిమిత్తమై పొందుపరచి వాటిపై కట్టిన కట్టడమే అమరావతి స్తూపం. ఇది ఒక పర్యాటక అకర్షణ. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి ఉన్నత స్థితిని పొంది, బౌద్ధం క్షీణతతో మరుగున పడి. 1797 లో మరలా వెలుగులోకి వచ్చింది. అమరావతి శిల్పకళ బుద్ధ విగ్రహం మలచడంలోను, నాగిని ప్రతిమల రూపురేఖలలోను తనదైన ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆగ్నేయ ఆసియా, శ్రీలంక దేశాలకు ఈ శిల్పకళ విస్తరించింది. ఇక్కడ లభించిన శాసనాల వలన బ్రాహ్మీలిపి నుండి తెలుగు లిపి పరిణామ క్రమంలో తొలి నాలుగు దశలను తెలుపుతుంది. శాసనాలు, శిల్పాలు స్థానిక పురావస్తు ప్రదర్శనశాల, చెన్నైలో పురావస్తు ప్రదర్శనశాల, బ్రిటీష్ మ్యూజియము లలో భద్రపరచబడ్డాయి.